మార్పించి లక్షలు సంపాదించారంటారు కొంతమంది. ప్రజల్ని చంపి వాళ్ళ ఆస్తుల్ని దోచుకుని ఫ్యాక్షన్ రాజకీయాలతో కోట్లు సంపాదించారంటారు మరికొంతమంది. నిజమెంతో దేవుడికే తెలియాలి! మరి దీన్ని పాజిటివ్ గా ఎలా తీసుకోవాలి?
"అతడి తెలివి తేటల్ని. ధైర్యాన్ని".
ఆ మాటల్ని తలచుకుని మళ్ళీ నవ్వుకున్నాడు. ఆ తరువాత అతని ఆలోచనలు మద్యం వ్యాపారి ధర్మారావు పైకి వెళ్ళాయి.
దొంగ తనంగా మద్యం తయారు చేయడం. అమ్మడం. ఎక్సైజ్ వాళ్లకు తెలియకుండా సరుకు రవాణా చేయడం. అతడు చేస్తున్నవన్నీ మోసాలే! అతడి గురించి పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి. "దొంగ తనంగా ఒక లోడ్ లారీని పంపించాలంటే అది గమ్య స్థానం చేరే వరకు ఎన్ని టెన్సన్స్ అనుభవించాలి. పోలీసులకు దొరక్కుండా ఎన్ని ప్లాన్స్ వేయాలి. ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలి....అమ్మో తలచుకుంటేనే భయమేస్తుంది!. అంతరిస్క్ ఉంది కాబట్టే వాళ్ళు అంత సంపాదిస్తున్నారు!! ...అంటూ సాగిపోతున్న ఆలోచనలు ఎవరో 'విజయ్' అని తనను పేరు పెట్టి పిలవడంతో అలోచనలకు బ్రేక్ పడింది.
ఎక్కడో విన్న గొంతు అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు.
తన డిగ్రీ క్లాస్ మేట్ శేఖర్ కన్పించాడు.
" ఏరా! ఎన్నాళ్ళయింది నిన్నుచూసి. బావున్నావా? ఏమిట్రా ఆలోచిస్తూ పోతున్నావ్. పిలిచినా పలక్కుండా అలా పోతున్నవేమిటీ...?" పెద్ద పెద్ద అడుగులతో అలా దగ్గరికి వస్తూ అడిగాడు శేఖర్.
" ఏం లేదు. బావున్నావా? చాలా కాలమైంది నిన్ను చూసి. ఎక్కడున్నావ్? డిగ్రీ తరువాత విడిపోయిన మనం ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషం గా ఉంది. చెప్పరా. ఎలా ఉన్నావ్?".
బావున్నానన్నాడు.
"చెప్పరా. ఏం చేస్తున్నావ్?".
"నేను. శిరీష ఇండస్ట్రీస్ లో పని చేస్తున్నాను".
"శిరీష ఇండస్ట్రీస్ లో నా!?"
"అవును. అలా ఆశ్యర్య పోతావేంటీ! ఆ కంపెనీ నీకు తెలుసా?"
"ఆ కంపెనీ గురించి మంచిగా విన్నాను. ఆ కంపనీలో ఏ జాబ్?".
"కంపెనీ సెక్రటరీ. ప్రొప్రయిటర్ ఆనందరావు పర్సనల్ అడ్వైజర్. కంపెనీ లీగల్ అడ్వైజర్. ఓ రకంగా చెప్పాలంటే ఆయనకు 'అన్నీ' నేనే. నేనేమీ చెబితే అదే ఫైనల్. ఆయనకు నా మీద చాలా నమ్మకం, గౌరవం ఉన్నాయి".
"గుడ్. అయితే లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నావన్నమాట".
"ఎస్. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు ఉండేటట్లు లేదు..త్వరలో మా కంపెనీ మూత పడబోతోంది!" దిగులుగా అన్నాడు.
ప్రక్కన బాంబు పడ్డట్లు అదిరి పడ్డాడు విజయ్.
"వ్వాట్! నిజమా!"
"అవును. కంపెనీ నష్టాల్లో ఉంది. కావున అమ్మే ఆలోచనలో ఉన్నాడు మా యజమాని".
శేఖర్ మాటలు వింటూనే తన ఆలోచనలో పడిపోయాడు.
అది చూసి శేఖర్ అన్నాడు." ఎరా! మాటిమాటికీ అలా ఆలోచనలో పడి పోతున్నావ్. త్వరగా పెళ్లి చేసుకోరా. ఆలోచనలు తగ్గుతాయ్. వ్యవహారం ఇలా నాన్చుతూ పోతే నేనే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను..."
విజయ్ ఆ మాటల్ని అంతగా ఎంజాయ్ చెయ్యలేదు!
"అద్సరే గానీ అంత తొందరగా ఫ్యాక్టరీని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది..." తెలుసుకోవాలనే కుతూహలంతో అడిగాడు.
"దానికి చాలా కారణాలున్నాయి. జీతాలు బకాయిలు. సరుకు నిల్వలు. మా యజమాని మంచితనాన్ని ఆసరాగా చేసుకుని తిరిగి ఇవ్వని అప్పులు. బాడ్ డేట్స్. వీటికి తోడు కరెంట్ కస్టాలు.....అన్నీ ఒకేసారి చుట్టూ ముట్టాయి".
"మీ ఫ్యాక్టరీ విలువెంత?"
"సుమారు వందకోట్లు!. అయితేనేం. నష్టాల్లో ఉంది. ఫాతిక కోట్లు అప్పు లున్నాయి. ఫ్యాక్టరీ రన్ చేయాలంటే మరో ఫాతిక తక్షణమే కావాలి. అమ్మితే అప్పులు పోగా పది కోట్లు కూడా మిగిలేలా లేదు. ఎవ్వరూ కొనే టట్లు లేదు!".
" మీ యజమాని తో మాట్లాడు. ఆ ఫ్యాక్టరీ నేను కొంటాను. అప్పులు,బకాయిలన్నీ నేనే చూసుకుంటాను. ఫాతిక కోట్లు ఇస్తాను".
ఆ మాటలు విని శేఖర్ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు.
"వ్వాట్! జోక్ చేస్తున్నావా?"
"లేదు. నిజమే చెబుతున్నాను".
ఆ మాటలకు విజయ్ వైపు చూశాడు. అతని ముఖం లోని సీరియస్ నెస్ చూసి 'నిజమే' అనుకున్నాడు. అయినా తనకు కలిగిన సందేహాన్ని. వీడకుండా "అంత డబ్బు నీ దగ్గర..." అంటూ అర్దోక్తి గా ఆపు చేశాడు.
అప్పటికప్పుడు తన మనసులో రూపు దిద్దు కున్న ప్లాన్ బయట పెట్టకుండా 'నాకు డబ్బులేచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను తలచుకుంటే అలాంటివి చాలా కొనగలను!'.
"అయితీ నీవు బినామీవన్నమాట!"
ఆ మాటలకు చిన్నగా నవ్వాడు విజయ్. అదే నిజమని నమ్మాడు శేఖర్.
"అయితే నీవు నాకొక సహాయం చేయాలి" అని అడిగాడు విజయ్.
"తప్పకుండా. చెప్పు. ఏమిటది?" ఆత్రుతతో అడిగాడు శేఖర్.
విజయ్ చెప్పాడు.
అంతా విని సరే నన్నాడు శేఖర్.
ఫ్యాక్టరీ తన సొంతం అయిన తరువాత "మామా! చూడు నీ ఫ్యాక్టరీ కొన్నాను. ఇప్పుడు నీ కూతుర్ని ఇస్తావా ? పెళ్లి ముహూర్తం ఎప్పుడో చెప్పు..." అని అడగాలనుకున్నాడు.
అయితే ఆ ఫ్యాక్టరీ తన 'సొంతం' కాగానే తన మనసు మారిపోతుందని ఊహించలేక పోయాడు.
*****
"ఐదు నక్షత్రాల హోటల్ ముందు కారు ఆగింది. డ్రైవర్ వినయంగా వచ్చి కారు డోర్ తెరిచాడు. అందులోచి దిగాడు బ్యాంక్ మేనేజర్".
అతడ్ని రిసీవ్ చేసుకోవడానికి కారు దగ్గరకు వెళ్ళాడు విజయ్.
కారు డ్రైవర్ విజయ్ ను చూపించి 'ఇతనే' అన్నాడు బ్యాంక్ మేనేజర్ తో.
విజయ్ పరిచయం చేసుకున్నాడు.
"మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఆ... గుర్తొచ్చింది. ఎమ్మెల్యే దగ్గర చూశాను..."అన్నాడు మేనేజర్ విజయ్ తో.
విజయ్ చిన్నగా నవ్వి, అవునన్నట్లు తలూపాడు.
మేనేజర్ తో కలిసి హోటల్ గదిలోకి అడుగు పెట్టాడు విజయ్. అప్పటికే అక్కడ మోడ్రన్ డ్రస్సులో అర్ధ నగ్న దుస్తులతో కుర్చుని ఉన్నారు ఊర్వశి హోటల్ అమ్మాయిలు. విజయ్ ని చూడగానే వినయంగా లేచి నిలబడ్డారు.
మేనేజర్ కూర్చోవడానికి కుర్చీ చూపించాడు విజయ్. మేనేజర్ కూర్చున్నాడు. మద్యం బాటిళ్ళూ, గ్లాసులు తెచ్చి మేనేజర్ టేబిల్ మీద పెట్టారు అమ్మాయిలు. వాళ్ళు అలా కాస్త ముందుకు వంగి మందు సీసాలు టేబిల్ మీద పెడుతున్నప్పుడు ' ఆ దృశ్యాన్ని' అతను అలా కళ్ళర్ప కుండా ఆశగా చూడడాన్ని గ్రహించాడు విజయ్.
హోటల్ గది తాళాలు ఆ అమ్మాయిలకు ఇస్తూ "మేం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. మీరు ప్రక్కనే ఉన్న 109 గది లోకి వెళ్ళండి. అక్కడే ఉండండి. ఈ రాత్రికి మీతో 'పని' ఉంది. సరేనా?" అన్నాడు విజయ్.
సరే నన్నట్లు తలూపి వాళ్ళు తమకు కేటాయించిన గది తాళాలు తీసుకుని వెళ్ళిపోయారు.
ఈ రాత్రికి తాము మేనేజర్ తో 'కలిసి' ఉండటం వలన విజయ్ కోట్ల వ్యాపారంలో తాము కూడా ఓ భాగమే నన్న 'నగ్న' సత్యం వారికి ఆక్షణం తెలియదు!
మద్యం, 'తోలు' వ్యాపారం అడ్డమైన పనులకు షార్ట్ కట్స్!
ఆ తరువాత మందు గ్లాసులో పోసి మేనేజర్ కు అందించాడు విజయ్.
అలా అవీ ఇవీ మాట్లాడుకుంటూ రెండు రౌండ్లు పూర్తీ చేశారు. ఇక తను చెప్పాల్సి న అవసరం వచ్చిందని గ్రహించి అసలు విషయం బయట పెట్టాడు విజయ్.
"నేనే వంద కోట్లు విలువ చేసే 'శిరీష్ఇండస్ట్రీస్ 'ను కొంటున్నాను! కంపెనీ యజమాని ఆనందరావు కూతురు నేను ప్రేమించుకుంటున్నాం. ఆ తరువాత పెళ్లి చ్సుకోబోతున్నాం. నిజానికి ఆ ఫ్యాక్టరీ ని కొనట్లేదు! ఆనందరావు కు శిరీష ఏకైక కుమార్తె. చివరకు ఆ ఫ్యాక్టరీ నాదే! అలాంటప్పుడు కొనడం దేనికీ!!అనవసరంగా రిజి స్ట్రేషన్ ఫీజు దండగ! ఫ్యాక్టరీ పేరు అఫీషియల్ గా అతని పేరుమీదే ఉంటుంది. ఆయనకు డబ్బు ఇవ్వడం మూలంగా అమ్మేశానని అనుకుంటాడు. రిజి స్ట్రార్ ఆఫీసులో అయన సంతకం చేసే డాక్యుమెంట్ల లో బ్యాంక్ లోన్, నా అగ్రిమెంట్లు కాగితాలు కూడా ఉంటాయి. కాబట్టి తరువాత ఏ ప్రాబ్లెమ్స్ రావు! ఫ్యాక్టరీని కొన్న తరువాత నా చేతుల్లోకి తీసుకుని లాభాల బాట పట్టిస్తాను!"
"ఎందుకలా?"
"ఆనంద రావు ఎంతో కష్టపడి నెలకొల్పిన కంపెనీ అది. ప్రస్తుతం నష్టాల్లో ఉంది. తన కళ్ళముందే తన బిడ్డలా పెచుకున్న కంపెనీ మూత పడుతుందంటే తట్టుకోలేక పోతున్నాడు. అమ్మేయాలనుకున్నాడు. కాని అయన కూతురికి అది ఇష్టం లేదు. నా కాయే భార్య కోరిక మేరకు నేనే ఆ కంపెనీ కొనాలను కుంటున్నాను. దానికి మీరు సహాయం చేయాలి".
"నష్టాల్లో ఉన్న కంపెనీకి అప్పు ఇవ్వడం కుదరదు".
"దాన్ని మా అడిటర్ల తో ఓవర్ వాల్యూ చేసి బ్యాలన్స్ షీట్ తయారు చేస్తాను. దాని పైన లోన్ ఇవ్వండి. ఒక్క సంవత్సరం లో తిరిగి ఇచ్చేస్తాను."
"అలా ఇవ్వొచ్చు గానీ ...లీగల్ గా ప్రాబ్లెమ్స్ వస్తాయి".
"అవన్నీ నేను చూసుకుంటాను. కావాలంటే మీతో ఎమ్మెల్యే గారు మాట్లాడతారు" అని చీకట్లో రాయి విసిరాడు.
'మనవాడే. పర్లేదు... చెప్పు' అన్న ఎమ్మెల్యే మాటలు గుర్తుకు వచ్చాయి మేనేజర్ కు. రాయి తగలాసిన చోటే బలంగా తగిలిందనుకున్నాడు విజయ్.
అయినా బెట్టు చేశాడు బ్యాంక్ మేనేజర్. "మీకు బ్యాంక్ రూల్స్ గురించి తెలియదనుకుంటా ! అంత డబ్బు ఇవ్వం. పైగా మార్కెట్ వాల్యూ అమాంతం పెంచి లోన్ ఇవ్వవు!".
No comments:
Post a Comment
మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు