అప్పటికే అక్కడకు చేరుకున్న విలేకర్ల కెమరాలు 'క్లిక్'మన్నాయి. సరిగ్గా అప్పుడు అక్కడికి లోకల్ ఎస్సై వచ్చాడు. సిబి ఐ జెడి ప్రకాష్ ను చూడగానే అతని గుండె ఝల్లు మంది. అయినా తనకు 'పెద్ద'వాళ్ళ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో ప్రకాష్ దగ్గరకు వెళ్ళాడు.
పోలీసులు సురేష్ ను జీప్ ఎక్కించారు.
ఎస్సై ప్రకాష్ తో అన్నాడు. "అతనెవరో తెలుసా! సి. ఎం. కొడుకు..."
"అయితే..."
"సి.ఎం. గురించి మీకు తెలియదు అతను తలచుకుంటే..."అని అర్దోక్తి గా ఆపుచేసి, భయపెట్టాడు.
"నాకేం భయం లేదు" అని వెళ్లి వెహికల్లో కూర్చున్నాడు.
చివరగా ప్రయత్నించాడు ఎస్సై.
"సి.ఎం.గురించి మీకు చాలా విషయాలు తెలియదు. అతను ఫ్యాక్షనిస్ట్. అతనిపై డజనుకు పైగా మర్డర్ కేసులు ఉన్నాయి... "
"ఇంకా ప్రూవ్ కాలేదు కదా!"
ఊహించని సమాధానం ప్రకాష్ నోటివెంట వెలువడగానే నిర్ఘాంత పోయాడు ఎస్సై.
జీప్ వెళ్ళిపోయింది.
*****
కోపంతో విజయ్ చాంబర్ లోకి అడుగు పెట్టింది శిరీష.
చేతిలో ఉన్న న్యూస్ పేపర్ విసిరికొట్టింది. అది సరాసరి వెళ్లి విజయ్ మీద పడింది.
ముంచుకొచ్చిన కోపాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుని శిరీష వైపు చూశాడు.
"చూడు. ఆ న్యూస్ పేపర్ చూడు. ముఖ్య మంత్రి గదిలో దొరికిన అమ్మాయిలూ నీ కాలేజ్ స్టూడెంట్స్".
అతను అర్ధం కానట్లు చూశాడు.
"నీవిలాంటి నీచ మైన పనులు చేస్తావనుకోలేదు. అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నావని తెలుసు. కానీ ఇలా దిగ జారి బ్రతుకుతావను కోలేదు. నీ కాలేజ్ లో ఉన్న వాళ్ళు నీ బిడ్డలతో సమానం. ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పిస్తే వాళ్ళను మోసం చేసి, వాళ్ళ శరీరాలతో డబ్బులు సంపాదిస్తావా! డబ్బు కోసం ఏమైనా చేస్తావా. రేపెప్పుడైనా అవసరం అయితే నీ భార్యను కూడా 'చేతులు' మర్చుతావా..."అంటున్న ఆమె మాటలకు కోపంతో చైర్ లో నుండి విసురుగా లేచాడు.
"నోర్ముయ్!"
అన్నాడు. అప్రయత్నంగా చేయి ఎత్తాడు. ఎత్తిన చేతిని అలాగే గాల్లోనే ఆపేసి, కంట్రోల్ చేసుకున్నాడు.
ఊహించని ఆ పరిణామాలకు ఒక్క క్షణం బిత్తర పోయింది. క్షణం సేపే వెంటనే తేరుకుంది. అంత పెద్ద మాటలు అనకూడని అంతరాత్మ హెచ్చ రిస్తున్నా లెక్క చేయకుండా మాట్లాడింది.
"ఇంతవరకు నీమీద ఉన్న గౌరవం పోయింది! నన్ను కొట్టేంత తప్పు నేనేం చేశాను. అన్యాయాన్ని ఎదురించినందుకా..."నిలదీసింది.
ఆమెకు ఏడుపొచ్చింది. ఏడ్చింది. గట్టిగా ఏడ్చేసింది.
ఎప్పుడూ చూడని ఆమె కల్లో నీళ్ళు చూసి చలించిపోయాడు. "సారీ శిరీషా..." అని ఏదో చెప్పా బోయాడు. అంత లో అక్కడికి సి బి ఐ జె డి ప్రకాష్ వచ్చాడు. అతడు ఎంటర్ అవగానే తన తడి కళ్ళ ను అతడు చూడకుండా అటువైపు తిరుగుకుంది శిరీష.
"విజయ్! పబ్లిక్, ప్రెస్ వాళ్ళు ఆ కాలేజ్ మీదని ప్రచారం చేస్తున్నారు! మిమ్మల్ని అరెస్ట్ చెయ్యాలని మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఆ కాలేజ్ మీది కాదని ఎన్ని చెప్పినా విన్పించుకోలేదు. మేం ప్రయత్నించాం. విఫలమయ్యాం. మీ దగ్గ ర సంతకం తీసుకుని, అఫిషియల్ గా వాళ్లకు తెలియజేస్తాం. ఇక్కడ సంతకం పెట్టండి...ప్లీజ్!" అని కాగితం అందించాడు.
విజయ్ సంతకం చేశాడు.
ఆ పేపర్ తీసుకుని పరిశీలనగా చూశాడు సి బి ఐ ఆఫీసర్.
"ఏం సర్! సంతకాలు సరిపోలేదా!"
ఉప్పెనలా వచ్చిన తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు.
"నీ లాంటి క్రిమినల్స్ ను ఇంత వరకు నా సర్వీసులో చూడలేదు. నీ లాంటి 'వైట్ కాలర్' నేరగాడ్ని అంత సులువుగా వదిలిపెట్టను. ఏదో ఒక రోజు దొరుకుతావు. ఆ రోజు నిన్ను కాపాడుకోవడానికి ఎవ్వరూ రారు. చివరకు 'నీవాళ్ళు'కూడా..." అని అక్కడ్నుంచి పెద్ద పెద్ద అడుగులతో వెళ్లి పోయాడు.
ఆ తరువాత శిరీష కూడా వెళ్ళడానికి రెండడుగులు వేసింది.
ఆమె చేయి పట్టుకుని ఆపాడు.
"నన్ను క్షమించ శిరీష! నేను తప్పు చెయ్యలేదు. నాకూ దానికీ ఏ సంబంధం లేదు. వెంటనే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ను పిలిచి విషయం కనుక్కుంటాను. అతడ్ని సస్పెండ్ చేస్తాను..."
"ఎందుకు విజయ్ నన్నిలా ఏడిపిస్తున్నావ్! మోసం చేస్తున్నావ్. నువ్వు మంచిగా మారాలని నేను చేయని పూజ లేదు. మ్రొక్కని దేవుడు లేడు! అయినా నీవు మారలేదు. ఆ కాలేజ్ నీది కాదా? నీ బినామీ సంస్థలో తప్పు జరిగితే నీది కాదా? అలా అనుకునివుంటే రాముడు రాజ్యం లో ఎవరో అన్న మాటలకు బాద్యత ఎందుకు వహిస్తాడు. రాజ్యం లో ఎవరు తప్పు చేసినా తనదే బాధ్యత అని రాముడు పరిపాలించిన రాజ్యం మనది. అలాంటిది నీ బినామీ సంస్థలో జరిగిన నేరానికి బాధ్యత వహించావా?పైగా రాజకీయ నాయకుడిలా అతడ్ని సస్పెండ్ చేస్తానంటావా? ఎంత స్వార్ధం. ఇకచాలు. నీప్రేమా వద్దూ, నువ్వూ వద్దు. నువ్వు చేస్తున్న తప్పులు గుర్తుకు వచ్చినప్పుడల్లా నరకం అనుభవిస్తున్నాను...ఇకనాకు ఓపిక లేదు. నిన్నూ, నీ తప్పులను భరించే శక్తీ లేదు."
"శిరీషా! ప్రస్తుతం నీవు ఎన్ని చెప్పినా వినే పరిస్థితి లో లేవు. అయినా ఒక్కమాట. నాకు నెల రోజులు టైం ఇవ్వు. నేనెలాంటి వాడినో, నా ఆశయం ఏమిటో తెలుస్తుంది. నేనెందుకు ఇలా ఉండానో తెలుస్తుంది. సరిగ్గా ముప్ఫయి రోజులు సమయం ఇవ్వు...ఆ తరువాత నీ నిర్ణయం నీవు తీసుకో!"
ఆమె సమాధానమేమీ చెప్పకుండా అక్కడనుంచి వెళ్ళిపోయింది.
శిరీష అలా వెళ్ళగానే సెక్రటరీని పిలిచాడు. గదిలోకి అడుగు పెట్టగానే చెప్పాడు.
"కల్పనా! త్వరలో నా జీవితాశయం నెరవేరబోతోంది. దానికి చాలా డబ్బులు అవసరం. మన దగ్గర నమ్మకంగా పనిచేసే 116 మంది బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బు కావాలి! వాళ్ళతో విడివిడిగా వివిధ బ్యాంకులలో , వివిధ ప్రదేశాలలో ఉన్న సొమ్మును విత్ డ్రా చేయించు. ఆ డబ్బు ముందు నా పర్సనల్ గదిలో ఉన్న లాకర్లలో పెట్టేటట్లు ఏర్పాటు చెయ్యి. ఆ తరువాత ఎక్కడ పెట్టాలో తెలియజేస్తాను..."
సరేనంది. వెళ్ళడానికి ప్రయత్నిచింది.
"ఒక్క నిమిషం ఆగు. ఈ పని సీక్రెట్ గా జరగాలి. ఒకరికి తెలియకుండా మరొకరికి చెప్పు...అంతా రహస్యం."
"ఎందుకూ?" అని అడగబోయి, కంట్రోల్ చేసుకుంది. అక్కడ్నుచి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే విజయ్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ కి,విద్యా సంస్థల ఇంచార్జ్ లకు , హాస్పిటల్ మేనేజ్ మెంట్ కు ఫోన్ చేశాడు. డబ్బంతా విత్ డ్రా చేయమని చెప్పాడు.
ఒకరి కితెలియకుండా మరొకరు కోట్లకొద్దీ డబ్బులను రహస్య ప్రదేశానికి తరలిస్తున్నారు.విజయ్ ప్లాన్స్ తెలియకుండా కోటానుకోట్లు బ్యాంకులనుండి ఒకేసారి విత్ డ్రా చేశారు.
******
లత ఇంటి ముందు బైక్ ఆపింది శిరీష.
శిరీషను చూడగానే లత సంతోషం రెట్టింప య్యింది. పరుగున వచ్చి శిరీష ముందు వాలిపోయింది. 'రా ... వెళదాం' అంటూ చేతులు పట్టుకుని, ఆప్యాయంగా పిలుచుకెల్లింది.
"చాలా రోజుల తరువాత మా ఇంటికి వచ్చావు. నాకు చాలా హ్యాపీ గా ఉంది. ఇక్కడే కూర్చో... గాలి బాగావస్తుంది. కరెంట్ లేదు. ఇంట్లో ఉండటం కష్టం..."అని ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో కుర్చీ వేసింది.
"ఉండు. రెండు నిమిషాల్లో వచ్చేస్తాను..." అని లోనికి వెళ్ళ బోయింది.
ఆమె చేయి పట్టుకుని ఆపింది శిరీష. "నాకేమీ వద్దు. ఇప్పుడే ఇంట్లో తినేసి వచ్చాను..."
"రాక రాక మా ఇంటికి వచ్చావు. కనీసం కాఫీ అయినా ఇస్తాను. కాదనకు. నా తృప్తి కోసం... ప్లీజ్!" అని జవాబు కోసం ఎదురు చూడకుండా లోనికి వెళ్ళిపోయింది.
లత ఇంట్లోకి వెళ్ళింది. శిరీష బోర్ గా ఫీల్ అయ్యింది. పరిసరాలు చూసింది. చిన్న చిన్న ఇళ్ళు. అదీ దూర దూరం గా ఉన్నాయి. మధ్య మధ్య లో ఖాళీ స్టలాలు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్లు వున్నాయి. పనివాళ్ళు, రోజూ వారీ కూలీలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు ... ఉండే ఏరియా లా ఉంది..."అనుకుంటున్న ఆమె ఆలోచనలు లత వస్తున్న అడుగుల చప్పుడుతో ఆగి పోయాయి.
లత ఇచ్చిన కాఫీ తీసుకుంది. లత ఆమె కు ఎదురుగా కూర్చుంది. సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంతలో అక్కడికి లత తండ్రి వచ్చాడు. శిరీషను చూడగానే ఆప్యాయంగా పలకరించాడు.
"బావున్నావమ్మా!"
"బావున్నాను అంకుల్".
"లతా! తినడానికి ఏమైనా పెట్టు..." అన్నాడు కూతురితో.
"వద్దు అంకుల్. ఇప్పుడే కాఫీ త్రాగాను..."
అతను ఇక అక్కడ ఉండడం మర్యాద కాదని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
అతడి నడకలో జీవం లేదు. మాటల్లో మందు వాసన వచ్చింది. అతడు అలా ఇంట్లోకి వెళ్తుంటే విజయ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి శిరీషకు.
"కూతురు సంపాదన కోసం పెళ్లి సంబంధాలు చెడగొడు తున్నాడేమో!"
అలా క్షణం సేపు అలా ఆలోచించింది. వెంటనే తనని తను తిట్టుకుంది. అందుకే అనుమానం ఫెనుభూతం అంటారు పెద్దలు...అనుకుంటూ లతను చూసింది.
లత చూపులో తేడా ఉంది! తన ముందే ఎవర్నో లైనేస్తోంది...అన్న అనుమానంతో లత చూస్తున్న వైపు చూసింది. అంతే! దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపొయింది. అక్కడ... పక్కింట్లో నుండి వస్తూ కన్పించాడు... విజయ్ !
ఆమె సంభ్రమాశ్చర్యాలతో అలా చూస్తుండి పోయింది. తరువాత తేరుకుంది. లత వైపుచూసింది. ఆమె సిగ్గుపడింది. శిరీషకు తన ప్రేమ విషయం తెలిసిపోయిందని మరింత సిగ్గుపడింది. అందంగా ఉంది ఆ దృశ్యం.
"అతనెవరో తెసుసా!" శిరీష అడిగింది.
తెలుసన్నట్లు తలాడించింది లత మరింత సిగ్గుతో.
"ఎవరు?" అని అడిగింది ఆశ్చర్యంగా.
telugu cinemaa story laa undi. katha baavundi
ReplyDelete