Saturday, April 27, 2013

రూలర్ సినిమాకథ-08


"ఊహూ! అలా నడుచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, రోడ్ల మీద అన్నింటినీ చూసుకుంటూ, వెళ్తుంటే ఎంత బావుంటుంది!".
"ఇలాంటి చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి . లేకపొతే అవి కాస్త పెరిగి కొండంత అసంతృప్తి గా మారిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న కోర్కెలు ఒకసారి చేస్తే చాలు. మళ్ళీ మళ్ళీ చేయాలని పించదు! వద్దనో, విసుక్కునో తిరస్కరిస్తే, చేస్తే బావుండు అన్న కోరిక మనసులో కలిగి వేధిస్తుంటుంది. అంతేకాదు తన మాటకు విలువ ఇవ్వలేదని బాధపడతారు. ఇటువంటి కోర్కెలు తీర్చనప్పుడు తన ప్రేమ మీద సందేహం కలుగుతుంది! అందుకే కాదనలేక 'సరే'నన్నాడు.
ఒకరి చేయి ఒకరు పట్టుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, ప్రక్క ప్రక్కన నడుస్తూ, అలా రోడ్ల వెంట తిరుగుతూ, చిరు తిండ్లు కొంటూ, అలా అలా సరదాగా పార్కు దగ్గరకు వెళ్ళారు".
ఇద్దరూ పార్కు లో మూలగా కూర్చున్నారు.
విజయ్ అమ్మాయితో కల్సి పార్క్ కు రావడం అదే మొదటిసారి!
"శిరీషా! లక్ష్యం ఏర్పరచుకుని దాని కోసం శ్రమించి, అది పదిమందికి ఉపయోగ పడుతుంటే, చూసి ఆనందించడం తప్పు కాదు కదా! నేను ప్రజల బాగు కోసం ' పని' చేయాలనుకుంటు న్నాను .. లక్ష్యం కోసం..."అని సాగుతున్న మాటలకు బ్రేక్ వేసింది. తన మనసులోని భావాలు వెలిబుచ్చింది.
"చక్కని దృశ్యాలు. మెల్లగా పలకరించే పిల్లగాలులు. సువాసనలు వెదజల్లే పువ్వుల పరిమళాలు. ఇంత అందమైన ప్రదేశాలలో టాపిక్ అంత అవసరమా?"
తరువాత విజయ్ మాట్లాడలేదు. చుట్టూ వున్న వాళ్ళను చూస్తూ ఆలోచనలో పడిపోయాడు.
"లవర్స్. ముసలివాళ్ళు. కాలేజ్ స్టూడెంట్స్...జంటలు జంటలుగా ఉన్నారు. కబుర్లు చెప్పు కుంటున్నారు. త్రుళ్ళి త్రుళ్ళి పడుతున్నారు. పడి పడి నవ్వుకుంటున్నారు. అరుస్తున్నారు. గెంతులేస్తున్నారు... రహస్యంగా  మాట్లాడుకుంటున్నారు...అసలు అంతగా మాట్లాడుకోవడానికి వాళ్ళ దగ్గర మేటర్ ఏముంటుంది? సచిన్ బ్యాటింగ్, తెలంగాణా సమస్య, సినిమాల గురించో మాట్లాడుకోవడానికి పార్కుకి రానక్కరలేదు. అలా మాట్లాడుకుంటూ, పోగాడుకుంటూ ఉంటే బోర్ కొట్టదా!"
"విజయ్! నాకేం పన్లేక నీతో పార్క్ కు వచ్చానను కుంటున్నావా? అటు చూడు ప్రేమికులెంత సరదాగా ఉంటున్నారో...ఇలా అయితే ఇక్కడెందుకు పద పోదాం".
"ఏయ్! ఎందుకంత కోపం. నీకు ప్రకృతి అంటే ఇష్ట మనీ, డిస్టర్బ్ చేయకూదనీ...మాట్లాడలేదు!:
"అవున్నిజమే!" అనుకుని పార్క్ లోని అందాలను చూస్తూ ఉండిపోయింది. అతను మళ్ళీ  తన ఆలోచనలో పడిపోయాడు.
"తిండి కోసం రైతులు దుక్కి దున్నుతున్నారు. శ్రామికులు రోజంతా కస్టపడి పనిచేస్తున్నారు. పని మనుషులు ఇళ్ళ సంఖ్య పెంచుకుంటున్నారు...కానీ వీళ్ళంతా ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు!"
"విజయ్! నీకెంత చెప్పినా లాభం లేదు. నీతో రావడం నాది బుద్ది తక్కువ. ఇక చాలు నీ ప్రేమ. లే. పద పోదాం".
అంతలో విజయ్ సెల్ మ్రోగింది.
చొరవగా అతని జేబులోని సెల్ తీసుకుని 'హలో'అంది.
"నేను కల్పన ను మాట్లాడు తున్నాను. సర్ ఉన్నారా?"
"కల్పనా! ఎవరు మీరు?" తెలుసుకోవాలిని అడిగింది.
కల్పన పేరు వినగానే ఫోన్ తీసుకుని, "నేనే మాట్లాడు తున్నాను. చెప్పు కల్పనా?" అన్నాడు.
ఆమె చెప్పింది విన్నాడు.
"నేను పదే పది నిమిషాల్లో వచ్చేస్తాను..."అన్నాడు ఫోన్ లో.
"శిరీషా! నాకు అర్జెంట్ పని ఉంది. నీవు త్వరగా ఆటోలో ఇంటికి వెళ్ళు."అని అమ్మాయి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా అక్కడనుంచి వెళ్ళిపోయాడు విజయ్.
"ఫోన్ చేసిన అమ్మాయి ఎవరు? అంత అర్జెంట్ పనేమీ? ఎందుకు రమ్మని చెప్పింది?..."అలా ఆలోచిస్తోంది శిరీష.
*****
విజయ్ తన సీట్లో కూర్చొన్నాడు. అతనికి ఫైల్ అదించింది అతని పర్సనల్ సెక్రటరీ కల్పన.
అతను ఫైల్ చూస్తున్నాడు. ఆమె చెప్పుకు పోతోంది.
"మొదట మీరు చెప్పినట్లే అనాధలు, కష్టాల్లో ఉన్నవారు, అంగ వైకల్యం తో ఉండి నా అన్న వాళ్ళ ప్రేమ లేక బాధ పడే వారిని గుర్తించి 516 మందిని తీసుకొచ్చాం. వారి వివరాలు ఇందులో ఉన్నాయని మరొక ఫైల్ అందించిందివారిని మానసిక వైద్యులు, పెద్దలు, గురువులు, అనుభవం ఉన్న వాళ్ళతో రకరకాల పరీక్షలు జరిపాం. చివరకు నిస్వార్ధంగా, అంకిత భావం తో, తిండి పెట్టిన వారి ఋణం జీవితాంతం మరిచిపో కూడదనే నిస్వార్ధం, పట్టుదల ఉన్నవారు, చెప్పినట్లు వినే 116 మందిని సెలక్ట్ చేశాం..."
అప్పుడతనికి వివేకానందుని మాటలు గుర్తుకు వచ్చాయి.
"దేశ భవిషత్తు మార్చడానికి వంద మంది యువకులు చాలు".
క్షణం సేపు  అతను మాట్లాడలేదు. ఆమె వెంటనే, " మీకోసం అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్నారు!" అంది.
"సరే. పద పోదాం" అన్నాడు సీట్లో నుండి లేస్తూ.
"అభ్యర్థులను మీరొకసారి ఇంటర్వ్యూ చేసి కన్ ఫర్మ్ చేస్తే ..." అర్దోక్తి గా ఆపు చేసింది.
ఆ మాటలకు కు అతను చిన్నగా నవ్వాడు.
 "నీమీద నాకు పూర్తి నమ్మకం ఉంది! అందుకే పని నీకు అప్పగించాను".
ఆమెకు సంతోషం కలిగింది. తన బాస్ మెచ్చుకుంటే ఆనందం కలగనిదెవ్వరికీ!
మీటింగ్ హాల్లో 116 మంది అభ్యర్థులు కూర్చుని ఉన్నారు. విజయ్ అడుగు పెట్టేసరికి వాతావరణం అంతా నిశ్శబ్దం గా మారిపోయింది. విజయ్ అలా నడుచు కుంటూ ఎత్తయిన ప్లేస్ మీద ఏర్పాటు చేసిన స్టేజ్ మీదకు వెళ్ళాడు. అంతలో ఒకతను పరుగున వచ్చి షర్ట్ కు మైక్ అమర్చాడు. అతను ఏం చెబుతా డోనని ఆశ్చర్యంగా అతని వైపు చూశారు.
"మైడియర్ ఫ్రెండ్స్! ఇక్కడికి మిమ్మల్ని ఇలా ఆహ్వానించడంలో ఒక అంతరార్థం ఉంది..." అని ఒక్క క్షణం మౌనంగా ఉండి అందరూ శ్రద్దగా వింటున్నారని కన్ ఫర్మ్ చేసుకున్నాక మొదలు పెట్టాడు.
"నాకొక  జీవితాశయం  ఉంది! దాని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను. దానికి డబ్బులు కావాలి! మీ సహాయం కావాలి. మీరు సిటీ అంతా నేను మంచి వాడనీ, నా దగ్గరకు వస్తే సమస్యలు పరిష్కార    మవుతాయనీ ప్రజలకు చెప్పాలి! విజయ్ మంచి వాడు. పేదవాళ్ళకు సహాయం చేస్తాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు. ధైర్య వంతుడు...డబ్బులిస్తే ఏమైనా చేస్తాడు!...ఇలా ఒకటి రెండు ఉదాహరణలు కలిపి చెప్పాలి. అంటే నేను చేయబోయే 'పని' ఏమిటో తెలిసిందా?" అని సమాధానం కోసం ఎదురు చూడ సాగాడు.
"సెటిల్ మెంట్లా!" అన్నారెవరో మెల్లగా వినిపించీ, వినపడనట్లుగా.
విజయ్ కు మాటలు విన్పించాయి.
"అవున్నిజమే! మీరనుకున్తున్నట్లు సెటిల్ మెంట్లేదానికి మీరు ప్రచారం చెయ్యాలి. సహజంగా ఉండాలి. మీరు ఇద్దరిద్దరు గా విడిపోయి టీ స్టాల్ దగ్గరో, చిన్న హోటల్ దగ్గరో మీలో మీరే మాట్లాడు కుంటున్నట్లు, నేను మీ కు సహాయం చేసినట్లు చెప్పుకోవాలి. ఎవ్వరికీ అనుమానం రాకూడదుఅలా చేసినందుకు మీకు నెలకు ఫాతిక వేల జీతం".
"ఫాతిక వేలా!" ఆశ్చర్యంగా అన్నారు.
"అంతేకాదు. ఆరు నెలలో మీ పనితనం నచ్చితే మీ కు పర్మనెంట్ గా నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తున్నాను"
అని చిన్న ఆశ కలుగ జేశాడు.
"ష్యూర్... తప్పకుండా" లాంటి పదాలు ప్రతీ వారి నోటి వెంట వెలువడ్డాయి.
సంతోషంతో విజయ్ హాల్లోనుంది బయటకు వచ్చాడు.
అయితే వాళ్ళను 'పెద్ద స్కాం ' లో భాగ స్వాములను చెయ్యాలనే విజయ్ ఆలోచనలు వారికి తెలియదు!
"థాంక్యూ వెరీ మచ్ కల్పనా! ఇంత పెద్ద బాధ్యతను సక్రమంగా నిర్వర్తించ  గలిగావు" మెచ్చుకున్నాడు విజయ్.
మొదట మీరు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినపుడు నాకు భయం వేసింది. ఇంత పెద్ద పని సక్రమంగా నిర్వర్తించ గలనా అని అన్పించింది. అలా సందేహం కలిగిన ప్రతిసారీ మీరు నేను ఉద్యోగంలో చేరిన ప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి!
"నేను సెక్రటరీ ఎంత అందంగా ఉందని పట్టించుకోను! ఆమె ఉద్యోగానికి 'తగిన' వ్యక్తి అవునా, కాదా అని మాత్రమే ఆలోచిస్తాను. దాని మీదే నీ కెరీర్ ఆధారపడి ఉంటుంది".
మాటలు ఎప్పుడూ నా డ్యూటీని గుర్తు చేస్తుంటాయి అంది.
అతనికి ఆమెపై ఉన్న గౌరవం మరింత పెరిగింది.
*****
బీచ్  చాలా రష్ గా ఉంది. విజయ్ శిరీష వైపే చూస్తున్నాడు. ఆమె చాలా అందంగా ఉంది. సముద్రం మీద నుంచి వస్తున్న గాలికి ఆమె ముంగురులు అందంగా ఎగురుతున్నాయి. దగ్గరిగా జిరిగి ఆమె అతని చేతిని అందుకుని అతని అరా చేతిలో తన చేతిని వేసింది. ఆమె అతని భుజాల పైన వాలిపోయింది. మౌనంగా వాళ్ళు సముద్రాన్ని చూస్తున్నారు! ఆమె అలాగే అతడ్ని పట్టుకుని ఉంది.
అతడు సముద్రపు అలలలో  ఆడుకుంటున్న జంటలను చూశాడు. చుట్టూ  తిరిగి  చూశాడుగోవా  బీచ్ లో ఇలా    ఉంటారని   విన్నాడు! అయితే  ఇలా... అర్ధ నగ్నంగా ఉంటారని ఊహించలేక పోయాడు! అతనికి సినిమాలో టెం సాంగ్ గుర్తుకు వచ్చింది.
"పొద్దునే లేపేసి మడి కట్టేసి పూజ గదిలో కుర్చోబెట్టే వాడు మాకొద్దు...బికినీ వేసి బీచ్ లో వదిలేసే వాడు కావాలి".
ఆడవాళ్ళ మీద ఇలా 'పచ్చి' గా రాసే వాడిని తిట్టుకునే వాడిని. కాని ఇప్పుడు ఇలా వీళ్ళని చూసి పా రాసాడేమో ననిపిస్తుంది!.
ఏదో ఆలోచనలో  మునిగి  పోయాడు. తనని పట్టించుకో లేదని గ్రహించింది . చటుక్కున ప్రక్కకు  జరిగింది.
"మాటి మాటికీ ఏమిటలా ఆలోచనలో పడిపోతున్నావ్! ఎప్పుడూ డబ్బు ఆలోచనలేనా? డబ్బు ఒక్కటే   లోకం కాదు. నీకు డబ్బు పిచ్చి బాగా పట్టింది.నీకెన్ని చెప్పినా వెస్ట్. నీతో రావడం నాదే బుద్ది తక్కువ. ఎప్పుడూ అవే ఆలోచనలు..." అంది వెళ్ళడానికి పైకి లేస్తూ.
ఆమె చేతిని పట్టుకుని ఆపాడు."సారీ శిరీష! రా. కూర్చో..." అన్నాడు.
అమ్మాయి మరింత ఇరిటేట్ అయిపొయింది.
"అసలు డబ్బు సంపాదించగానే పెళ్లి చేసుకుంటా నని చెప్పావు. చివరకు సంగతి మరచి పోయావు. మా ఇంటికి రమ్మంటే రావు. ఇప్పుడొద్దు..అంటావు. సరదాగా ఇలా బయటకు వస్తే అలా ఆలోచనలతో ఉంటావు. చెప్పు  నేనంటే   నీకు ఇష్టం  లేదా ? నేనే  మైనా బలవంతం గా నిన్ను ఇబ్బంది పెడుతున్నానా?"

1 comment:

  1. superlove story...rulerstory chaalaa baavundi

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు